టవర్లు లేకున్నా కాల్స్‌.. బీఎస్‌ఎన్‌ఎల్‌ శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది!

  • ఫోన్‌ ధర రూ.1.34 లక్షలుగా నిర్ణయం
  • కొనుగోలుకు డాట్‌ అనుమతి తప్పనిసరి
  • రక్షణ, విపత్తు సేవలకు ప్రత్యేకంగా రూపకల్పన
  • దేశవ్యాప్తంగా 4జీ విస్తరణ కొనసాగిస్తున్న బీఎస్‌ఎన్‌ఎల్‌
మొబైల్‌ టవర్‌ సిగ్నల్‌ అందని ప్రాంతాల్లో కూడా కాల్స్‌ చేసుకునే అవకాశం కల్పిస్తూ బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త శాటిలైట్‌ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అడవులు, సముద్ర ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, విపత్తులు సంభవించిన చోట్ల కూడా ఈ ఫోన్‌తో మాట్లాడొచ్చు. అయితే ఇది సాధారణ స్మార్ట్‌ఫోన్‌లా ఎవరైనా కొనుగోలు చేసే అవకాశం మాత్రం లేదు.

ఈ ఫోన్‌ ధర రూ.1,34,166. కొనుగోలు చేయాలంటే ముందుగా కేంద్ర టెలికమ్యూనికేషన్స్‌ శాఖ (డాట్‌) నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అనుమతి లేకుండా శాటిలైట్‌ ఫోన్‌ను ఉండటం లేదా వినియోగించడం చట్టపరమైన సమస్యలకు దారి తీసే అవకాశం ఉందని బీఎస్‌ఎన్‌ఎల్‌ తెలిపింది.

సాధారణ మొబైల్‌ ఫోన్లు సమీపంలోని టవర్ల ద్వారా పనిచేస్తాయి. కానీ ఈ శాటిలైట్‌ ఫోన్‌ నేరుగా ఉపగ్రహాలతో అనుసంధానం అవుతుంది. అందుకే సెల్యులర్‌ నెట్‌వర్క్‌ లేని ప్రాంతాల్లో కూడా వాయిస్‌ కాల్స్‌ చేసుకోవచ్చు. ఈ సేవల కోసం అంతర్జాతీయ శాటిలైట్‌ నెట్‌వర్క్‌ సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ వెల్లడించింది.

ఈ ఫోన్‌లో అత్యవసర పరిస్థితుల కోసం ఎస్‌వోఎస్‌ ఫీచర్‌ను కూడా అందించారు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఎక్కువసేపు పనిచేసే బ్యాటరీ, కఠిన పరిస్థితులను తట్టుకునే బలమైన డిజైన్‌ను ఇందులో పొందుపరిచారు. అత్యవసర కమ్యూనికేషన్‌ను దృష్టిలో పెట్టుకొని దీన్ని రూపొందించారు.

రక్షణ శాఖ, సముద్ర రవాణా, విపత్తు నిర్వహణ బృందాలు, గనుల పరిశ్రమ, మారుమూల ప్రాంతాల్లో పనిచేసే సంస్థలు, సాహస యాత్రికులు, దూర ప్రాంతాలకు వెళ్లే యాత్రికులను దృష్టిలో పెట్టుకొని ఈ ఫోన్‌ను రూపొందించినట్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ తెలిపింది. సాధారణ వినియోగదారుల కోసం కాకుండా ప్రత్యేక అవసరాలున్న వారికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది.

ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా 4జీ సేవల విస్తరణపైనా బీఎస్‌ఎన్‌ఎల్‌ దృష్టి పెట్టింది. ఇప్పటికే దాదాపు 99 వేల 4జీ సైట్లను ప్రారంభించినట్లు సంస్థ వెల్లడించింది. మరిన్ని 4జీ టవర్ల ఏర్పాటుకు కూడా కేంద్రం అనుమతించే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది.

BSNL
Satellite Phone
Department of Telecommunications
Satellite Connectivity
Emergency SOS Feature
BSNL 4G Expansion

More Telugu News